ఛాంపియన్స్ ట్రోఫీపై భారత్ సందిగ్ధతకు తెర..! 2 d ago
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చలకు ఫుల్స్టాప్ పడింది. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్‌లో పర్యటించలేమన్న భారత్ ప్రతిపాదనకు మొగ్గుచూపిన ఐసీసీ, తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించేందుకు హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య హోదాలో పాక్‌తో పాటు యూఏఈలో భారత్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే ఓవైపు హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పిన పీసీబీ 2024 నుంచి 2027 వరకు జరిగే టోర్నీల్లో తాము కూడా భారత్‌లో పర్యటించమంటూ స్పష్టం చేయడంతో తటస్థ వేదికలపై నిర్వహణకు బీసీసీఐ ఒప్పుకుంది. టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని ఐసీసీ పేర్కొంది.దీంతో వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌తో పాటు 2026లో జరిగే టీ20 వరల్డ్‌కప్ కోసం పాక్ జట్టు భారత్‌లో కాకుండా వేరే దేశంలో మ్యాచ్‌లు ఆడుతుంది. 2028లో పాకిస్థాన్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ వరకు ఈ ఒప్పందాన్ని కొనసాగించనున్నారు. బార్క్లే స్థానంలో కొత్తగా ఛైర్మన్ బాధ్యతలు అందుకున్న జై షా నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఒప్పందం జరుగడం విశేషం.